- 3,259
- Less than a minute
జనతా కర్ఫ్యూ.. కరోనాపై అతిపెద్ద యుద్ధాన్ని ప్రకటించిన మోదీ
కరోనా వైరస్ కట్టడి కోసం ప్రధాని మోదీ ‘జనతా కర్ఫ్యూ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. కోవిడ్ మహమ్మారిని అందరం కలిసి కట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఇందుకోసం మార్చి 22న (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రధాని కోరారు. ఇది ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలు చేపడుతున్న కార్యక్రమమని మోదీ తెలిపారు.
జనతా కర్ఫ్యూ గురించి దేశ ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ప్రధాని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ పాటించడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవడంతోపాటు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడుకోవచ్చని మోదీ తెలిపారు. కరోనాపై పోరాటంలో మానవత్వ తప్పక గెలుస్తుందని, భారత్ విజయం సాధించి తీరుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
వచ్చే కొద్ది వారాలపాటు భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలని.. అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రధాని మోదీ సూచించారు. సీనియర్ సిటిజన్లు కచ్చితంగా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు.
కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉన్నప్పటికీ లక్షలాది మంది హాస్పిటళ్లు, విమానాశ్రయాలు, ఆఫీసుల్లో పని చేస్తున్నారు. డెలివరీ బాయ్‌లు, మీడియా ప్రతినిధులు తమ విధులను నిర్వర్తిస్తున్నారన్న మోదీ.. వారికి సంఘీభావం ప్రకటించడం కోసం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి తలుపులు, కిటికీల వద్ద చప్పట్లు కొడుతూ.. గంటలు మోగించాలన్నారు.