SechoolEdu
kcr

కరోనా అలర్ట్..రేపు సీఎం కేసీఆర్ కరీంనగర్‌లో పర్యటన

కరీంనగర్‌లో కరోనా వైరస్ కలకలం రేపిన వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఆ నగరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై కరీంనగర్‌ పర్యటించి పరిశీలించనున్నారు. అనంతరం ఆయన అక్కడే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సీఎంవో ట్వీట్‌లో పేర్కొంది. అనంతరం కరీంనగర్‌లో ఆరోగ్యకర వాతావరణానికి తీసుకోవాల్సిన అంశాలపై ఆయన దిశానిర్దేశం చేస్తారని ప్రకటనలో వివరించారు. నిజానికి శుక్రవారమే ముఖ్యమంత్రి కరీంనగర్ పర్యటన ఉన్నా ప్రధాని మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ఉన్నందున శనివారానికి వాయిదా పడ్డట్లుగా సీఎంవో వివరించింది.

ఇటీవల కరీంనగర్‌లో ఇండోనేసియా నుంచి వచ్చిన పది మంది బృందం పర్యటించిన సంగతి తెలిసిందే. వారిలో ఏడుగురికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరీంనగర్‌లో యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టింది. జిల్లా మంది గంగుల కమలాకర్ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. 100 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి, ఇండోనేసియా దేశస్థులు తిరిగిన చుట్టుపక్కల ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు చేయించారు. నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నారు.

కరోనా నియంత్రణ చర్యలపై కరీంనగర్ కలెక్టర్ సమీక్ష
శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక.. నగర సీపీ కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, వైద్యాధికారులతో కరోనా వైరస్ నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా లక్షణాలతో ఉన్న అనుమానితులను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తు్న్నట్లు చెప్పారు. అనుమానితులను హైదరాబాద్ తీసుకెళ్ళెందుకు వాహానాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వైద్య పరీక్షలకు తీసుకువచ్చే అనుమానితుల సెల్ ఫోన్ నెంబర్లు, వారి చిరునామాలను రికార్డు చేయాలని సూచించారు.

Related Articles